Narendra Modi: నేను బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడుతాను: తెలంగాణలో ప్రధాని మోదీ

  • బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందన్న కాంగ్రెస్‌కు మోదీ కౌంటర్
  • తాను బతికున్నంత వరకు దళితులు, ఎస్టీలు, ఓబీసీలకు రిజర్వేషన్లు కాపాడుతానని హామీ
  • తాను ఉన్నంత వరకు ముస్లిం రిజర్వేషన్లను అమలు కానిచ్చేది లేదన్న ప్రధాని
  • కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం
  • కాంగ్రెస్ మొదటి నుంచి రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను అవమానిస్తోందని విమర్శ
PM Modi blames Congress and Nehru family over constitution issue

'నాకు రాజ్యాంగమే ధర్మగ్రంథం. నేను బతికి ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడుతాను. నేను బతికున్నంత వరకు దళితులు, ఎస్టీలు, ఓబీసీలకు రిజర్వేషన్లను కాపాడుతాను. నేను ఉన్నంత వరకు ముస్లిం రిజర్వేషన్లను అమలు కానిచ్చే ప్రసక్తి లేదు. కానీ కాంగ్రెస్ వస్తే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంద'ని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందన్న విమర్శలకు దీటుగా కౌంటర్ ఇచ్చారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ముదిరాజ్, లింగాయత్‌లకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. ముస్లింలకు రిజర్వేషన్ల ద్వారా రాజ్యాంగ వ్యతిరేక మతపర రిజర్వేషన్లకు పూనుకుందన్నారు.

కాంగ్రెస్ మొదటి నుంచి రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను అవమానించింది

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బంజారా సమాజాన్ని కూడా మోసం చేశాయన్నారు. లింగాయత్‌ల రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆరోపించారు. 2004లో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఏపీలో రికార్డ్ స్థాయి ఎంపీ సీట్లు వచ్చాయని, అయినా దళితులు, ఓబీసీలకు అన్యాయం చేసిందన్నారు. రాజ్యాంగం అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదన్నారు. అంబేడ్కర్ విషయంలోనూ అవమానకరంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాజ్యాంగానికి వ్యతిరేకమే అన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని పలుమార్లు అవమానించారన్నారు.

ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని దుయ్యబట్టారు. నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను యువరాజు మీడియా ముందే చించివేయడం ద్వారా ప్రధానిని... రాజ్యాంగాన్ని అవమానించారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాస్తూ మతపరమైన రిజర్వేషన్లను పెట్టి రాజకీయాలు చేస్తూ రాజ్యాంగాన్ని అవమానించారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగాన్ని ఉపయోగించుకుందని ఆరోపించారు. రాజీవ్ గాంధీ హయాంలో స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు.

పవిత్ర గ్రంథంలా భావిస్తాను

రాజ్యాంగాన్ని తాను పవిత్ర గ్రంథంలా భావిస్తానని ప్రధాని అన్నారు. తాను మొదటిసారి ప్రధాని అయినప్పుడు పార్లమెంట్ భవనం ముందు మోకరిల్లానని గుర్తు చేసుకున్నారు. 2019లో రెండోసారి ప్రధాని అయ్యాక రాజ్యాంగ పవిత్ర గ్రంథాన్ని సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని ఏనుగు అంబారీపై ఊరేగించానని... ఆ ఊరేగింపుతో తాను నడిచానన్నారు. తాను తొలి రోజు నుంచీ రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రిని తానేనన్నారు. రాజ్యాంగం అంటే తనకు మహాభారతం, రామాయణం, బైబిల్, ఖురాన్ వంటి పవిత్ర గ్రంథాలన్నారు. 

రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసే మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని పునరుద్ఘాటించారు. రాజ్యాంగంపై తన చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరన్నారు. 'తెలంగాణ నుంచి ప్రకటిస్తున్నాను... నేను మూడోసారి ప్రధాని అయ్యాక 75 ఏళ్ల రాజ్యాంగం సందర్భంగా అంగరంగ వైభవంగా ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో రిపబ్లిక్ డేను నిర్వహిస్తాం' అన్నారు. ఈ దేశాన్ని పాలించే హక్కు తమకు ఉందని కొందరు రాజవంశీకులు భావిస్తున్నారని చురక అంటించారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News